14 రోజులుగా కొనసాగుతున్న ఉపాధ్యాయుల దీక్షలు.. స్పందించని అధికారులు
ఉపాధ్యాయుల నిరసనతో అగమ్య గోచరంగా గురుకుల విద్య
RTVNEWS (లవకుశ)తమసమస్యల పరిష్కారం కోరుతూ గురుకులాల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయులు, అధ్యాపకులు చేస్తున్న నిరసన దీక్ష 14వ రోజు కొనసాగుతుంది.పాడేరు డివిజన్ 11 మండలాలకు చెందిన గురుకుల పాఠశాలలు కళాశాలలలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయులు అధ్యాపకులు జిల్లా కేంద్రం పాడేరు ఐటిడిఏ ఎదురుగా గత 14 రోజులుగా రిలే దీక్షలు కొనసాగిస్తున్నారు. ఉపాధ్యాయులు అధ్యాపకుల దీక్షకు వివిధ సంఘాలు వర్గాలు, రాజకీయ నాయకులు మద్దతు ప్రకటిస్తున్నప్పటికీ ప్రభుత్వం గానీ జిల్లా ఉన్నత స్థాయి అధికారులు కానీ కనీసం స్పందించకపోవడంతో ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఆవేదన చెందుతున్నారు. కాగా 14వ రోజు నిరసన కార్యక్రమాల్లో భాగంగా జిల్లా కేంద్రంలో గిరిజన సంక్షేమ గురుకుల ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయ మరియు అధ్యాపక జిల్లా యూనియన్ ఆధ్వర్యంలో గాంధేయవాది మార్గంలో శాంతియుత నిరసన పేరిట నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ విద్యాసంస్థలలో గాని, ఇతర సంక్షేమ గురుకులాల్లో గాని ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయులు అధ్యాపకులు లేరని కేవలం గిరిజన సంక్షేమ గురుకులాల్లో మాత్రమే ఔట్సోర్సింగ్ విధానంలో ఉపాధ్యాయులు అధ్యాపకులు పనిచేస్తుండటం వల్ల ఉద్యోగ భద్రత కొరవడగా చాలీచాలని జీతాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు ఆందోళన వ్యక్తం చేశారు. గత ఎనిమిది సంవత్సరాలుగా జీతాలు పెంచకపోగా, అటెండర్ ల కంటే తక్కువ జీతాలు ఇస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 191 గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు కళాశాలలలో పనిచేస్తున్న 1633 మంది ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయులు అధ్యాపకులు గత 25 రోజులుగా తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, తమ న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసన కార్యక్రమాలతో రిలే దీక్షలు కొనసాగిస్తుండగా జిల్లాలో గత 14 రోజులుగా దీక్షలు కొనసాగుతున్నాయి. దీంతో మన్యంలోని గురుకులాల్లో విద్యా బోధన కుంటుపడుతుండగా విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గిరిజన సంక్షేమ గురుకులాల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయులు అధ్యాపకులను సీఆర్టీలుగా మార్పు చేయాలని, తమకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ 2022 పిఆర్సి ప్రకారం జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.