కొండ వాగుపై కర్రల వంతెన నిర్మాణం
ఇబ్బందులు తప్పయి అంటున్న రైతులు
RTVNEWS (లవకుశ)ప్రజా ప్రతినిధులు, అధికారులు తమ బాధలను చూసైనా ఎప్పటికైనా తమ కష్టాలను తీరుస్తారని ఎదురుచూసిన రైతాంగానికి నిరాశ ఎదురు కావడంతో రైతులందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి కొండ వాగుపై కర్రలతో వంతెన నిర్మించుకున్నారు. అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం నడింపాలెం పంచాయితీ శివారు గాం కొండ గ్రామంలో రైతులు పండించిన పంటలను తమ గ్రామానికి తెచ్చుకునేందుకు అనేక ప్రయాసలకు గురయ్యేవారు. అదేవిధంగాపండించిన వివిధ రకాలైన కూరగాయలు పంటలు మార్కెట్ కు తరలించేందుకు కూడా ఎటువంటి అవకాశాలు లేకపోవడంతో పండించిన పంటను పొలాల్లోనే వదిలేసిన సంఘటన కూడా వారికి అనేకసార్లు ఎదురయ్యాయి. దీంతో ఎన్నాళ్ళయినా తమ కష్టాలు ఇలాగే ఉంటాయని భావించి గ్రామస్తులందరూ ముందుకు వచ్చి వర్షాకాలంలోఉధృతంగా ప్రవహించే కాలువ పై కర్రలతో వంతెన నిర్మించి వారి కష్టాలను గట్టెక్కించుకున్నారు. ప్రస్తుతం వరి పంటలు కోయడంతో వాటిని తమ గ్రామ సమీపంలోకి కట్టలు కట్టితీసుకొచ్చి కుప్పలుగా వేసుకుంటున్నారు. దీంతో ధాన్యం తో పాటు గడ్డి కూడా పశువులకు ఎంతగానో ఉపయోగపడతాయని, గతంలో అయితే ధాన్యం తీసుకొచ్చి గడ్డిని అక్కడే వదిలేసేవారుమని రైతులు తెలిపారు. ఈ విధంగా కర్రలతో వంతెన నిర్మించుకొని ఆదర్శంగా నిలవడంతో పలువురికి స్ఫూర్తిగా నిలిచారని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.